60 సంవత్సరాల చరిత్ర - 60 Years History
( నమస్తే తెలంగాణ సహకారం తో )
Date : 25-03-2017
ఆరు దశాబ్దాల చరిత్ర
Sat,March 25, 2017 01:36 AM
నమస్తే తెలంగాణ సహకారం తో
- లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో సర్వే
- పీవీ హయాంలో శంకుస్థాపన
- మోదీ హయాంలో ప్రారంభం
- ఉమ్మడి రాష్ట్రంలో బలైపోయిన రైలు
- స్వరాష్ట్రంలో సాకారం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కొత్తరైలు మార్గం నేడు ప్రారంభమవుతున్నది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పెద్దపల్లి- నిజామాబాద్ రైలు కూత పెట్టబోతున్నది. కేవలం 160 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కోసం ప్రజలు దశాబ్దాలుగా కలలు కన్నారు. ఆరాటపడ్డారు. ఎందరెందరో నాయకులు తమ శక్తిమేర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేక పోయింది. ఆఖరుకు స్వరాష్ట్రంలో ఆ కల నిజమైంది.
1956లోనే ఆమోదం..
పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గం చరిత్ర పరిశీలిస్తే నిజాం కాలంలోనే ఈ 160 కిలోమీటర్ల మార్గానికి ఆలోచన జరిగింది. ఎందువల్లనో అది సాకారం కాలేదు. హైదరాబాద్ భారత్‌లో విలీనమైన తర్వాత 1952లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు ప్రణాళికలు వేయటంతో పాటు రామగుండం-నిజామాబాద్ రైలు మార్గాన్ని కేంద్రానికి ప్రతిపాదించింది. ఆనాడు రైల్వే మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. ఆయన ఈ పథకాన్ని ఆమోదించి సర్వేకు ఆదేశించారు. 1956 మే 30న ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఒకటి రెండేండ్లలో ఈ మార్గాన్ని ప్రణాళికలో చేరుస్తామని ఎంపీ విఠల్‌రావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో..
1956 నవంబరులో హైదరాబాద్ రాష్ట్రం అంతర్థానమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రైలు మార్గం ప్రతిపాదన మూలన పడింది. ఆనాడు ఏపీ ఏర్పడకుండా ఉంటే 1958-59లోనే ఈ మార్గం సర్వే పూర్తై లాల్ బహదూర్ శాస్త్రి హామీ మేరకు పనులు ప్రారంభమయ్యేవి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటై పాలన ఆంధ్ర నాయకుల చేతిలోకి పోయింది. వాళ్లు రైలు మార్గాలన్నీ తమ ప్రాంతానికి తరలించుకున్నారు. ఆ తర్వాత దీన్ని పట్టించుకున్న వారు లేరు. 1977లో కేంద్రంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వం జనతాపార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సోషలిస్టు నాయకులు కొందరి కృషితో నాటి రైల్వే మంత్రి మధు దండావతే ఈ రైలు మార్గం ఫైలును దుమ్ము దులిపి సర్వేకు ఆదేశించారు. కేంద్రంలోని జనతా ప్రభుత్వం ఏడాదిన్నరకే కుప్పగూలింది. ఫైలు మళ్లీ మూతపడింది.
పీవీ ప్రధాని అయ్యాకే..
తెలంగాణది ఎంత దైన్యస్థితి అంటే ఇక్కడ ఓ చిన్న పని జరగాలన్నా ఎంతో ప్రయాస కావాలి. ఎన్నో ఉద్యమాలు జరగాలి. హింస, కాల్పులు, బలిదానాలు జరుగాలి. 1969 జై తెలంగాణ ఉద్యమంలో వందలమంది బలైతే పోచంపాడు ముందుకు కదిలింది. ఒకటి రెండు వర్సిటీలు, ఎన్టీపీసీ వంటి తాయిలాలు వచ్చాయి. ఇక రామగుండం-నిజామాబాద్ రైల్‌లైన్ మంజూరుకు ఏకంగా ఈ ప్రాంతంనుంచి ప్రధాని రావాల్సి వచ్చింది. దేశ ప్రధానిగా కరీంనగర్ బిడ్డ పీవీ నరసింహారావు పదవి అధిష్టించిన తర్వాత తెలంగాణ ప్రజల చిరకాల కోరికలు రెండింటిని నెరవేర్చారు. అందులో ఒకటి శ్రీరాంసాగర్ వరద కాలువ పథకం. రెండు పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గం. ఇదీ అంత ఆశామాషీగా జరుగలేదు. ఇక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి ఉన్నారు. వరదకాల్వ పథకం ఆయనకు ససేమిరా ఇష్టంలేదు. అయినా ప్రధాని 1991లో ప్రత్యేకంగా రాష్ట్రపర్యటన పెట్టుకొని వచ్చి మరీ రైలులైన్, వరదకాల్వకు శంకుస్థాపన చేశారు. కోట్ల అయిష్టంగానే నిధులు ఇచ్చారు. ఫలితంగా పెద్దపల్లినుంచి కరీంనగర్ వరకు లైను పూర్తి కావడానికే పదేండ్లు పట్టింది.
మలుపు తిప్పిన మలిదశ ఉద్యమం..
2001లో కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. దీనితోనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాయిలాలతో ఉద్యమాన్ని చల్లార్చే కార్యక్రమం ప్రారంభించారు. ఆగమేఘాల మీద దేవాదుల ప్రాజెక్టుకు,,గుత్ప, అలీసాగర్‌కు రాళ్లు వేశారు. ఆ సందర్భంగా తెలంగాణ ఎంపీలతో జరిగిన సమావేశంలో నాటి నిజామాబాద్ ఎంపీ ఈ రైలు మార్గాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో రామగుండం రైలు మార్గంలో కదలిక వచ్చింది. 2004ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. ఆనాటి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌తో కేసీఆర్‌కు మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల రామగుండం రైలు మార్గానికి లాలూ నిధులు ఇచ్చారు. తర్వాత కాలంలో తెలంగాణలో ఉద్యమ తీవ్రత కొనసాగుతూ రావటంతో కేంద్రం ఎంతోకొంత నిధులు ఇస్తూ వచ్చింది.
ఎంపీగా కవిత కృషితో..
2014లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రభుత్వం కొత్త రైలు ప్రాజెక్టుల అనుమతులు పూర్తిగా నిలిపివేసి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయటం మీద దృష్టి పెట్టింది. ఈ అవకాశాన్ని కవిత ఉప యోగించుకున్నారు. ఆమె కృషి వల్ల రెండంకెలు దాటని నిధుల కేటాయింపు మూడంకెలకు పెరిగింది. ఫలితంగా ఈ మార్గం శరవేగంగా పూర్తయ్యింది. దీనికితోడు ఆదిలాబాద్ ఆర్మూర్ మార్గానికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. మరోవైపు కరీంనగర్ హైదరాబాద్ లైన్ భూసేకరణ వేగవంతమైంది. స్వరాష్ట్రంలో ఇదో గొప్ప ముందడుగు. తెలంగాణ వచ్చింది కాబట్టికవిత వెంటపడి నిధులు తెచ్చుకున్నారు కాబట్టి ఇవాళ ఈ మార్గం ప్రారంభమైంది తప్ప ఉమ్మడి పాలనే కొనసాగి ఉంటే ఈ ప్రారంభోత్సవానికి మరో దశాబ్ద కాలం పట్టేది.
-సవాల్‌రెడ్డి
సికింద్రాబాద్ -పటాన్ చెరు - సంగారెడ్డి -జోగిపేట్ - మెదక్ రైల్వే రూట్ ఇందిరా గాంధీ హయాంలో సర్వే చేశారు కానీ అది ఏమైందో ఎవ్వరికి తెలియదు .
తెలంగాణ ప్రజలకు ముఖ్యముగా నిజామాబాద్ , కరీంనగర్ ప్రజలకు ఈ రోజు చాలా సంతోషమైన రోజు . పట్టు పట్టి సాధించించిన మన కవిత అక్క గారికి ధన్యవాదములు .
ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణాకు ఎంత అన్యాయం జరిగిందో ! ఎందుకింత వివక్ష ? తమ స్వార్థం ఎంతుందో తెలుస్తుంది . ఒకతను అసెంబ్లీ లో తెలంగాణ ఉచ్ఛరించవద్దు అని ఆంక్షలు పెడతాడు . ఇంకొకతను పాస్ పోర్ట్ కావాలా అంటాడు ఇంకొక ఆయన తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తావో చేసుకొమ్మని మన అన్న హరీష్ రావు ని అసెంబ్లీ లో బెదిరిస్తాడు .
ఎంతో మంది త్యాగాలు 1200 మంది, ముఖ్యముగా చాలామంది విద్యార్థులు బలిదానం తో తెలంగాణ ప్రజలందరి సహకారం తో ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా ఇంకా ఆ వాసనలు పోలేదు . న్యాయంగా వచ్చే నీటికి కటకటా ఉద్యోగుల విభజన ఇంకా జరుగలేదు . ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉదార స్వభావాన్ని మంచితనాన్ని చూసి ఇంకా పాత పద్ధతులు ఉపయోగిస్తే ఎలా ? అన్ని చోట్ల ఉదార స్వభావం వద్దని మనం ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ని కోరుదాం .
- seaflowdiary
- seaflowdiary
No comments:
Post a Comment